Sunday, September 24, 2023

#shila_neeve_shilpi_neeve_lyrics_in_telugu#vijayyesudas

నమస్తే తెలంగాణ 24 sep 2023 శిలలను కరిగించే నవీన గీతి గొర్ల బుచ్చన్న 87909 99116 మహాభారతం భారతీయుల జీవితాలతో తరతరాలుగా విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నది. ప్రజాకవి జయరాజు విరచిత కావ్యగానామృతం 'శిలా నీవే - శిల్పి నీవే- శిల్పం నీవే' కూడా అంతే. ఇంకా ఓ అడుగు ముందుకేసి ఆధునిక ప్రపంచ మానవాళికి చేస్తున్న హితబోధ కూడా. మానవుని జీవన గమ్యాన్ని, గమనాన్ని తన పద చరణాలతో మానవజీవితపు చీకటి పొరల్లోకి తొంగిచూసే టార్చ్ లైట్ ఇది. తన కావ్యగానాన్ని జీవిత సందేశంగా తొలి పదంలోనే చెప్తూ ముందు పంక్తుల్లోకి మనల్ని తీసుకెళ్తాడు జయరాజు. 'శిలా నీవే - శిల్పి నీవే - శిల్పం నీవే" పంక్తులు గాయకుని గొంతులో నుంచి పలికిన ప్రతిసారి 'ఓ మానవుడా ఎలా ఉన్నావు. ఎలా ఉండాలి. ఎందుకీ వెంపర్లాట. ఎందుకీ ఎల్లలు లేని సుఖసంతోషాల వేట, ఎటు నుండి ఎటు వైపునకు వెళ్లాలని అనుకుంటున్నావని’ పదే పదే మనల్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుందీ గానం. గుహల్లో నుంచి మానవ జీవనయానం కాస్మోపాలిటన్ నగరాల వరకు పయనించింది. ఈ ప్రయాణంలో తనకు జీవామృతాన్నిచ్చిన ప్రకృతిని మనిషి ఎప్పటికప్పుడు త్యజిస్తూ, దాన్ని సవాలు చేస్తూ తరాలుగా ముందుకు సాగుతున్నాడు. తన పూర్వపు తరాలకంటే తాను చాలా ఉన్నతంగా ఉన్నానని భావిస్తున్నాడు. భ్రమిస్తున్నాడు. అదే తీరులో జీవిస్తున్నాడు. ఇదే జీవన మార్గమని అనుకుంటున్నాడు. మార్కెట్ మాయాలోకంలో మనిషి తానో వినియోగదారుడన్న విషయాన్ని గుర్తించనట్టుగానే తాను ప్రకృతిలో భాగం అనే విషయాన్నీ మర్చిపోతున్నాడు. పోయాడు కూడా. ఇదే విషయాన్ని ప్రతి నాలుగు లైన్లకోసారి శ్రోతలకు తలపై ప్రేమగా నిమిరి చెప్తున్నాడు. కొన్ని పంక్తుల్లో తల్లిగా హితబోధ చేస్తున్నాడు. మరి కొన్ని పంక్తుల్లో లెక్కల మాష్టారులా గుడ్లురిమినట్టు కన్పిస్తాడు. మనతో పాటు మన పూర్వీకులు ప్రకృతికి, సాటి మనుషులకు చేసిన తప్పిదాలను కాస్త కఠినంగా.......హెచ్చరిస్తూ పితృహృదయ హస్తాలతో నిమురుతూ హెచ్చరిస్తున్నట్టుగా జయరాజు మానవ జనసముహాలను సోయిలోకి రమ్మన్నట్టుగా పదాలల్లాడు. బుద్ధుడు తథాగతుడై మానవ జీవిత గమనానికి మార్గనిర్దేశనం చేశాడు. ప్రజాకవి అయిన జయరాజు కూడా కమ్యూనిస్టు విప్లవమార్గం నుంచి ప్రాణికోటి ప్రాణాధారమైన ప్రకృతి. ఒడిలోకి వెళ్లిపోయాడు. కాలంతో పాటు ప్రజల సమస్యలు మారాయి. వారి ఆలోచనలు మారాయి. ప్రజాకోణాన్ని ఆచరిస్తూ నాడు విప్లవం బోధించిన అతడే నేడు ప్రకృతిలో మనిషిగా మమేకం కావాలని చాలా ముందుకు ప్రయాణించాడు. ఈ సంధియుగంలో సాహిత్యంలో ఒక స్తబ్దత నెలకొన్నది. దాన్ని బద్దలు కొడుతూ శిలల్లోకి..శిల్పాల్లోకి అక్షరాలను జీవితాలను నేర్పుతో ఒంపి ముందుతరాలకు అమృతంలా అందించారు జయరాజ్. 'కొండల్లో కోయిలపాట' అయిన కవి... నాడు అక్షరాలు దిద్దాలని చెప్పాడు. 'పచ్చని చెట్టు నేనురా...పాలు కారే మనస్సు నాదిరా' అంటూ తేనెలూరే జీవితరసాన్ని సరికొత్తగా ఆవిష్కరించాడు. వాస్తవానికి జయ రాజ్ సాహిత్యంలో ప్రకృతి ఎప్పటి నుంచో అంతర్భాగంగా ప్రవహిస్తూ ఉన్నది. బహుశా అడవి జీవితానికి దగ్గరగా ఉండటంవల్లనో...భూమి పొరల్లో పనిచేసే బొగ్గుగని కార్మికుల జీవితాలతో మమేకం కావడంవల్లనో కానీ అక్షరాలు నిప్పులనే కాదు పండు వెన్నెల్లాంటి చల్లదనాలను పంచడాన్ని అలవర్చుకొని ఏరులా పారుతున్న కవి జయరాజ్. ఇప్పుడు బుద్ధుని వెంట బోధివృక్షమై నడుస్తున్నాడు. మానవ జీవన సమస్యలకు మనస్సు కారణమని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఆధునిక మానవుడు అంతులేని ఉచ్చుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అన్నీ అందుబాటులో ఉన్నట్టే ఉంటాయి. ఏవీ తనవికావు. ఏదో చేయాలనుకుంటాడు. ఏమీ చేయలేక పోతాడు. ఇలాంటి అనేక సందేహాలకు అలతి అలతి మాటలతో మార్గాన్వేషణను చూపిస్తున్నాడీ కవి. ఈ సుదీర్ఘ కావ్యగానంలోని కొన్ని పంక్తులు మానసిక వికాస నిపుణుడిలా ఈ తరానికి బోధిస్తున్నట్టు ఉంటాయి. మరికొన్ని జనన మరణాల గుట్టును మనుషుల డీఎన్ఏ ఇదే అంటూ సులభంగా విప్పిచెప్పే సీసీఎంబీ సామాజిక పరిశోధకునివిగా దర్శనమిస్తాయి. వెనువెంటనే సరి కొత్త స్వరంతో కొత్త జీవపు పరిమళాలు వెదజల్లే సరికొత్త వసంత రుతువులా నూ తన పల్లవి అందుకొన్న పిల్లనగ్రోవి అవుతాడు. కాళిదాసు మేఘసందేశంలో ప్రియుడు, ప్రియురాలికి మేఘాలతో సందేశం పంపిస్తే ఈ తరం వాగ్గేయకారుడు జయరాజు యావత్ ప్రకృతి కలవరింతల, పలవరింతల, తుళ్లింతల, తుంపరల, పిల్లగాలుల తెమ్మెరలను జనసమూహాలపై కుమ్మరించాడు. పాల పిట్టల అరుపులను, పక్షి రెక్కల చప్పుళ్లను తన తత్వగీతంలో మనిషి చెవుల దగ్గరకు తీసుకొచ్చాడు. తనను తాను చెక్కుకుంటూ చరిత్రలో ఎట్లా నిలిచిపోవాలో ఈ తత్వగీతాలు ముక్కుసూటిగా చెప్తాయి. చేయి పట్టుకుని లక్ష్యమార్గంవైపు తీసుకెళ్తాయి. ప్రకృతిలో తానే ఓ భాగమనే విషయాన్ని మర్చిపోయిన మనకు ప్రకృతి ప్రతి అణువును తమదేఅని, పరవశించాలనే జీవిత లోతులను సునాయాసంగా నాలుగైదు అక్షరాల్లో ఒడిసిపట్టుకుని మన దోసిళ్లలో పోసినట్టుగా ఆ ఆలోచనకు రూపమిస్తే ఇట్లా ఉంటుందనే బొమ్మను మన గుండెల్లో ముద్రవేస్తున్నట్టుగా ఈ తాత్విక పదకావ్యగాన ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. అతి కొద్ది మంది మాత్రమే జీవితంలో అనుకున్నది సాధిస్తున్నారు. రాబోయే తరాలకు మార్గదర్శకులవుతారు. ఎందువల్ల అనేసందేహం వచ్చే వారికి ఈ తత్వజ్ఞానం తప్పకుండా సమాధానం చెప్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రకృతిని ఆరాధించే విలియమ్ వర్డ్స్ వర్త్, భారతీయుడైన బిబూతి భూషణ్ బంధోపాధ్యాయ, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లకంటే ఓ అడుగు ముందుకేసి ప్రకృతిని చూపిస్తున్నాడు జయరాజు. ప్రకృతిని చూసే కండ్లు వాటిని ఆరాధించాలి. వాటిని అంతం చేయ కూడదు. ప్రకృతి ధ్వంసమైతే మానవ జీవితం అంతరించినట్టే. ఇల్లు, పిల్లలు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే.. చెట్టు పచ్చగా ఉండాలని మోదుగు పూలంత అందంగా వలపోవస్తాడు కవి. పిచ్చుకలు, చిలుకలు, తీరొక్క పూలంత అందంగా విహరించే సీతాకోకచిలుకలు, సెలయేళ్ల ధారలు, మకరందాలను మోసుకొచ్చే తేనేటీగల అడుగులను, పండ్లరుచి, శుచిలను సజీవంగా ఉంచుకోవాలంటున్నాడీ కవి. అంతేకాదు జీవావరణాన్ని బతికిస్తున్న వాతావరణంలోని మేఘాలు, గాలి, ధూళిమిశ్రమాల సంకేత మూలకాలను విడమర్చిచెప్తూ గోధూళిని ఆస్వాదించాలంటున్నాడు. పసిడి పంటలు, పాల ధారలు, అన్నీ మనచుట్టే ఉన్నాయి. ఏవీ లేవని బాధపడతా వెందుకంటూ అనంతమైన దృక్కులతో తన సువిశాల ఆలోచనతో జీవించడంలో ఉన్న మధురిమను చూపెడుతాడు. ఈ కావ్యగానామృతం విన్నతర్వాత తమ చుట్టూ ఇంతటి అద్భుతమైన ప్రపంచం అల్లుకుని ఉన్నదా అనిపిస్తుంది. ఈ లోకంలో ఎవ్వరూ అనాథలుకారని....అన్నీ ఉన్నాకూడా ఏమీ లేదని భావించే వారి గురించి ఈ కవి వేదన చెందుతాడు. చందమామ, ఇంద్ర ధనస్సు, వెండివెలుగు, విశ్వమున విరబూసే తారలు అంటూ మానవుల పుట్టుక ఎంత అదృష్టమో కదా అంటూ వేదనా భరిత జీవులను, అచేతన హృదయాలకు ప్రకృతిలేపనాన్ని అద్ది వారికండ్లను తన తాత్వికతతో స్పర్శించేందుకు యత్నిస్తాడీ కవి. జన్మ, పునర్జన్మల గురించి వేలఏండ్ల కిందనే బుద్ధుడు చెప్పిన సూక్ష్మ సారాంశాన్ని, బుద్ధిస్టు తాత్వికతను ఎత్తి చూపించాడు. మేఘాలు కదిలి కరిగితే నదులై పారుతాయంటూ మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్రయాణించాలో చూపిస్తాడు. అంతులేని దురాశలను, నీతి బాహ్య విషయాలను ఎట్లా త్యజించాలో, ప్రకృతిలో ఎట్లా మమేకం కావాలో ఇరవై మూడు నిముషాల తాత్వికధారలో గుదిగుచ్చి ముందు తరాలకు అందించిన ప్రకృతి కవి జయరాజు. ఈ కావ్యగానాన్ని విన్న ప్రతి ఒక్కరూ ప్రకృతిని తమ గుండెలతోచూస్తారు. మనకాలపు గిజిగాడు ఈ జయరాజు. తమ జీవితాలను శిలా నీవే శిల్పం నీవే అని కవిరాజు జయరాజు కలం వెలుగు దారిలో చూసుకుంటారనటంలో సందేహం లేదు. - గొర్ల బుచ్చన్న 8790999116శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే... జయరాజు తత్వగీతంరచన...జయరాజు సంగీతం ..బల్లేపల్లి మోహన్ గానం...విజయ్ యేసుదాస్
శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే...జయరాజు తత్వగీతం
రచన...జయరాజు  సంగీతం ..బల్లేపల్లి మోహన్  గానం...విజయ్ యేసుదాస్
శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో
1.నిన్నునువ్వు మలుచుకుంటు నిలిచిపో చరితలో
పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో
జీవితం ఇక మళ్ళీ రాదు సార్ధకం చేసుకో||శిలా||
2.పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు
గరక పువ్వులు గడ్డి పాణ్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు
ఎన్నో ఉండి ఏమి లేదని భాధపడతా వెందుకు ?
జీవించటం లో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో||శిలా||
3.పండు వెన్నెల నిండు పున్నమి సందె వెలుగులు ఇంద్ర ధనసులు
సూర్యచంద్రులు క్రాంతి ధారలు విశ్వమున విరభూసె తారలు
పుడమి ఎంత గొప్పదో మన పుట్టు కెంత భాగ్యమో||శిలా||
4.కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు జుంటు తేనెలు
రామ చిలుకలు గోరువంకలు కోయిలలు కోనంగు లాటలు
తనివి తీరదు తనువు చాలదు జీవితం పై ఆశ సడలదు||శిలా||
5.వెలుగులను వేటాడు చీకటి చీకటిని చెండాడు వెలుగులు
పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జననం
క్షణము క్షణమొక మధుర గానం జీవితం చిగురాకు తరుణం||శిలా||
6.నీటిలో మన జన్మ ఉన్నది నిప్పులో చైతన్యమున్నది
గాలిలో మకరంద మున్నది భూమి పైనే జీవ మున్నది
గాలిలో మకరంద మున్నది భూమి పైనే జీవ మున్నది
అమ్మతనమే అంతరాత్మగ సాగిపోతుందీ ధరణి
సృష్టికి ప్రతి సృష్టినిస్తు కదిలి పోతుందీ జనని||శిలా||
7.ప్రకృతే మన పంచ ప్రాణం. ప్రకృతే మన హరిత హారం
ప్రకృతే మన కల్పవల్లి ప్రకృతే మన కన్న తల్లి
ప్రకృతిని కాపాడి నపుడే ప్రగతి సాగే నోయ్
ప్రకృతి విద్యంసమైతే ప్రాణ మాగే నోయ్||శిలా||
8.కలలు కనకుండా సంద్రం అలలు మీటేనా ?
కడలి రాకుండా మేఘం నదిగ మారేనా ?
చినుకు చినుకు వొడిసి పడితెనె సిరులు పండేదీ
శ్రమకు జీవం పోసినపుడే కడుపు నిండేదీ||శిలా||
9.కాలమన్నది తిరిగి రానిది కాల చక్రము ఆగిపోనిది
కాలముకు వెలకట్ట గలమా ? కాలమును భయపెట్ట గలమా ?
కాలమన్నది దాచి పెడితే, దాగి ఉంటుందా ?
కాలగమనం తెలియకుండ ఫలిత ముంటుందా||శిలా||
10. కొట్టినా నీ మేలు మరువని గట్టి గుణమీచెట్టులో
ఆకుతెంచితె పాలుకారే అమ్మతనమీ కొమ్మలో
సృష్టిలో ప్రతి జీవ జాతికి సృజన ఉన్నది నేర్చుకో
ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో..||శిలా||
11.కడుపులో పదినెలలు మోసి కంటికి రెప్పోలె కాసి
బరువు బాధ్యత లెన్నొ చూసి బతుకునంతా ధార పోసి
తల్లిదండ్రికి మించినా దైవముంటుందా ?
అమ్మనాన్నల కంటె మించిన ఆస్తులుంటాయా?||శిలా||
12.ప్రేమకు కొలమానముందా ? పెళ్ళికి ఒక రూపముందా ?
భార్య భర్తల బంధమన్నది బతుకునా విడదీయలేనిది
ఒకరి బాధ్యత ఒకరు మోసే బలము ఉన్నది ప్రేమలో
ఒకరి కోసం ఒకరు బతికే త్యాగమున్నది చెలిమిలో ||శిలా||
13.తల్లిదండ్రులు భార్య పిల్లలు అన్నదమ్ములు అక్కచెల్లెలు
కొడుకులు కోడళ్ళు వాళ్ళ మనువలు ముని మనువరాళ్ళు
పాత తరమే కొత్త తరముగ ప్రతి ఫలిస్తోందో...
జన్మకు ప్రతి జన్మగా సాగిపోతుందో..||శిలా||
14.మట్టిలో మమకారమున్నది చెట్టులో మన ప్రాణమున్నది
పుట్టుకకు ఒక లెక్క ఉన్నది పట్టు దలకో లక్ష్యమున్నది
సాధనే నీ ఊపిరై సాగిపోవాలి...ధైర్యమే నీ బలముగా గెలిచి తీరాలి||శిలా||
15.గాయపడకుండా హృదయం గేయమౌ శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే...జయరాజు తత్వగీతంతుందా ?
కలత పడకుండా మెదడు కావ్యమౌతుందా 
ఉలికి బయపడితే శిలలు శిల్పమౌతాయా ?
అలకు భయపడితే నావ దరికి చేరేనా 
ఆటుపోటులు ఎదురు దెబ్బలులేని జీవిత మున్నదా ?
ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా ?||శిలా||
16.వెన్ను నిమిరితె ఎగిరి పడకు వెన్నుపోటుకు బెదిరి పోకు
నమ్మి నువ్వు మోసపోకు నమ్మినోళ్ళను వదులుకోకు
ఏది ధర్మమో ఏదధర్మమొ ఏది సత్యమొ ఏదసత్యమొ
ఏది స్వార్థమె ఏది వ్యర్థమొ తెలిసి నడవాలోయ్ ...||శిలా||
17.కత్తితో సాధించ లేనిది కరుణతో సాధించ వచ్చు
పోరులో నువు గెలవ లేనిది ప్రేమతోను గెలవవచ్చు
మంచి పనులే మనిషికి గీటురాయి...
మనిషి పోయినంక మిగిలే గుర్తులోయి...||శిలా||
18.దేవుడిని చేసింది నీవు దైవముగ కొలిసింది నీవు
మతములను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు
మానవత్వమే మనిషికి మతము కావాలో..
మనుషులంతా ఒక్కటేనని హితము పలకాలో...||శిలా||
19.మత్తులో పడి మాసి పోకు మరణమును కొనితెచ్చు కోకు
వస్తువుకు నువు భానిసవకు స్వార్ధముతొ దిగజారి పోకు
బానిసత్వం వదలకుండ బాగుపడలేమో...
బతుకు అర్ధం తెలియకుండ మసలు కోరాదో...||శిలా||
20.కులములన్నియు కూలిపోవును మతములన్నియు మాసి పోవును
జ్ఞానమొక్కటె మిగిలిపోవును త్యాగమొక్కటె నిలిచి పోవును 
విజ్ఞానమే విశ్వాంతరాలను దాటివస్తుందో 
త్యాగమే నీ చరితను తిరిగి రాస్తుందో..||శిలా||
20.విజ్ఞాన మొక్కటె చాలదు వివేకమును అలవరుచుకో...
ధనము ఒక్కటె చాలను నీ గుణమును సరిచేసుకో..
కలిమి లేములు కష్ట సుఖములు కాలగమనం తెలుసుకో
మనిషి రుషిగా మారెటందుకు మార్గమన్నది ఎంచుకో||శిలా||
21.కన్నుమిన్ను ఎరుగకుండా కండకావర మొచ్చినా.
అదుపుతప్పి మదుపుతప్పి ఆస్తి పాస్తులు పెరిగినా.
అంగబలము అర్ధబలము అధికార బలముతో ఊగినా
మానవత్వం విడిచినంక మనిషి విలువేముండునా ...||శిలా||
22.ఇల్లు శుబ్రత వళ్ళు శుబ్రత మనసు శుబ్రత మాట శుబ్రత
నడిచినా నీ నడత శుబ్రత బతికినానీ బతుకు శుబ్రత
శుబ్రతే సువిశాల హృదయం కలిగి ఉంటుందో ...
శుబ్రతే ఈ మలినమంతా శుద్ధి చేస్తుందో ...||శిలా||
23.ఆడపిల్లను పుట్టనివ్వు ఆడపిల్లను పెరగనివ్వు
ఆడపిల్లను చదవనివ్వు ఆడపిల్లను ఎదగనివ్వు
ఆడపిల్లలె పుడమికి ఆనవాళ్ళు.
ఆడజన్మే లేకపోతే అమ్మలేదు ...||శిలా||
24.స్నేహమే మన జిందగీ స్నేహమే మన బందగీ
స్నేహమే మన సన్నిధి స్నేహమే మన పెన్నిధి
స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల
స్నేహమే మన దారి పొడుగున నీడనిచ్చే తోడులా ...||శిలా||
25.పాడి పంటలు కల్ల దేశం పస్తులతొ అల్లాడు తరుణం
పేదలే నిరు పేదలై ధనవంతులే ధనవంతులై
ఆకలితొ జన మొక్కటైతే ఆగమేనోయి...
అంతరాలు లేని లోకమె శాంతి వనమోయి...
శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో.......


No comments:

Post a Comment

#shila_neeve_shilpi_neeve_lyrics_in_telugu#vijayyesudas

నమస్తే తెలంగాణ 24 sep 2023 శిలలను కరిగించే నవీన గీతి గొర్ల బుచ్చన్న 87909 99116 మహాభారతం భారతీయుల జీవితాలతో తరతరాలుగా విడదీయలేని అనుబంధాన్న...